Raviteja Khiladi Movie | అదేంటి.. రవితేజ సినిమాతో రవితేజ పోటీ పడటం ఏంటి.. ఈయన సినిమాలు కనీసం రెండు నెలల గ్యాప్లో విడుదలవుతున్నాయి కదా అని అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు వింత. ఫిబ్రవరి 11న ఈయన నటించిన ఖిలాడి సినిమా విడుదల కానుంది. రమేష్ వర్మ పెన్మెత్స తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా క్రాక్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా ఖిలాడి సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు నిర్మాతలు. ఎందుకంటే గతేడాది కూడా క్రాక్ సినిమా అలాగే విడుదలై సంచలన విజయం అందుకుంది.
అప్పుడు కూడా కరోనా ఉంది.. 50 శాతం ఆక్యుపెన్సీ ఉండగానే సినిమా ఏకంగా రూ.38 కోట్ల షేర్ వసూలు చేసింది. బయ్యర్లకు దాదాపు రెండింతలు లాభాలు తీసుకొచ్చింది. అదే నమ్మకంతో ఇప్పుడు ఫిబ్రవరి 11న ఖిలాడి సినిమాను విడుదల చేస్తున్నారు. వాయిదా వేస్తారేమో అనే అనుమానాలు చివరి వరకు ఉన్నా కూడా ఇప్పుడు మార్చుకునే ఆలోచనలు లేనట్లే అని మరోసారి తేల్చి చెప్పారు నిర్మాతలు. తమ సినిమా అనుకున్న తేదికే వస్తుందని చెప్పారు. పైగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయింది. దాంతో సినిమా కచ్చితంగా విడుదల కావడం ఖాయం. ఇదిలా ఉంటే అదే రోజు రవితేజ మరో సినిమా కూడా రాబోతుంది. వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. తమిళ హీరో విష్ణు విశాల్ హీరోగా నటించిన ఎఫ్ఐఆర్ సినిమా కూడా ఫిబ్రవరి 11నే విడుదల కానుంది. దీనికి రవితేజకు ఏంటి సంబంధం అనుకుంటున్నారా..?
ఎఫ్ఐఆర్ సినిమాకు తెలుగులో సమర్పకుడు రవితేజనే. ప్రస్తుతం రవితేజతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు విష్ణు విశాల్. దానికంటే ముందు నుంచి కూడా వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే ఇప్పుడు ఈ హీరో నటించిన ఎఫ్ఐఆర్ సినిమాను తెలుగులో సమర్పిస్తున్నాడు మాస్ రాజా. పోస్టర్ పై కూడా ఇలాగే ఉంది. మాస్ రాజా రవితేజ ప్రెజెంట్స్ అని ఎఫ్ఐఆర్ సినిమా వస్తుంది. ఈ సినిమాకు విష్ణు విశాల్ నిర్మాత. ఆయనే స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను చేశాడు. మొత్తానికి రవితేజ హీరోగా నటించిన సినిమాతో.. ఆయన సమర్పిస్తున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతుందన్నమాట. మరి ఈ రెండు సినిమాలలో ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
FIR Trailer | రవితేజ సమర్పణలో ‘ఎఫ్ఐఆర్’..సస్పెన్స్ గా ట్రైలర్
FIR Trailer | రవితేజ సమర్పణలో ‘ఎఫ్ఐఆర్’..సస్పెన్స్ గా ట్రైలర్
Renu desai reentry | రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ !