Ravi Teja | టాలీవుడ్లో మాస్ సినిమాలకు కేరాఫ్‌గా మారిపోయిన హీరో రవితేజ. అదే కారణంగా అభిమానులు ఆయన్ను ప్రేమగా ‘మాస్ మహారాజా’ అని పిలుచుకుంటారు. రవితేజ పేరు వినిపిస్తే చాలు.. ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్, కామెడీ టైమింగ్ గుర్తొస్తాయి. అయితే తాజాగా రవితేజ తన సినిమాల్లో ఇకపై ‘మాస్ మహారాజా’ ట్యాగ్ ఉపయోగించొద్దని చెప్పాడన్న వార్తలు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేశాయి. దీంతో ఈ నిర్ణయం వెనుక కారణం ఏంటన్న ఆసక్తి పెరిగింది.ఈ విషయంపై తాజాగా దర్శకుడు కిషోర్ తిరుమల క్లారిటీ ఇచ్చారు. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.
2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిషోర్ తిరుమల మాట్లాడుతూ..ముందుగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా కథను రవితేజ గారికే చెప్పాను. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో వేరే హీరోతో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆయనతో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చేస్తున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు బలంగా అనిపించింది ఇది సంక్రాంతి ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని. నేను ఎప్పుడూ కథ, పాత్రను బట్టే సినిమాను ముందుకు తీసుకెళ్తాను. అందుకే ఈ సినిమా వరకు ‘మాస్ మహారాజా’ అనే ట్యాగ్ తీసేద్దాం అని రవితేజ గారు చెప్పారు” అని తెలిపారు.
దీంతో రవితేజ ఈ సినిమాకు కొత్త ఇమేజ్‌లో కనిపించబోతున్నారనే విషయం స్పష్టమైంది. మాస్ ట్యాగ్‌ను పక్కనపెట్టి, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ బయటకు రావడంతో మొదట ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయినప్పటికీ, దర్శకుడు చెప్పిన కారణం తెలుసుకున్న తర్వాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి. సంక్రాంతి బరిలో మాస్ మహారాజ్ కొత్త అవతార్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.