Ravi Teja | స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్‌లలోకి వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏషియన్ సునీల్ టాలీవుడ్ హీరోలందరితోనూ మల్టీ ప్లెక్సులను కట్టించేస్తున్న నేపథ్యంలో ఆ థియేటర్స్‌కి గిరాకి బాగానే ఉంటుంది. ఏఎంబీతో ఏషియన్ -మహేష్ బాబు ప్రయాణం మొదలైంది. ఆ తరువాత బన్నీతో కలిసి త్రిబుల్ ఏ థియేటర్ ఏర్పాటు చేశారు. ఈ థియేటర్లో కూడా సందడి బాగానే ఉంటుంది. ఇప్పుడు వెంకీమామ, రవితేజలు కూడా మల్టీప్లెక్సులను కట్టించేసుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండతో ఏవీడీ సినిమాస్ ను నిర్మించగా, దీనికి ప్రేక్షకులు బాగానే వస్తున్నారు.
అయితే కొన్ని నెలల క్రితం మాస్ మహారాజా రవితేజతో కలిసి ఏసియన్ సంస్థ ఓ మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని ప్రకటించింది. హైదరాబాద్ శివారు వనస్థలిపురం ప్రాంతంలో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి స్థాయిలో ముగింపు దశకు చేరుకుంది. ఇంటీరియర్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, జూలైలో ఈ మల్టీప్లెక్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవాన్ని పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లుతో ప్రారంభించాలని అనుకుంటున్నారట.. ఈ చిత్రం జూలై 24న విడుదల కానుంది. అదే రోజున రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావలసి ఉంది.
ఈ మల్టీప్లెక్స్‌ను అత్యాధునిక సాంకేతికతతో రూపొందించారు. 57 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, సినిమా ప్రేమికులకు కొత్త అనుభూతిని అందించే విధంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఇప్పటికే టెస్టింగ్ ప్రక్రియ పలు దఫాలు పూర్తయినట్టు తెలుస్తుంది. త్వరలో టాలీవుడ్ ప్రముఖులతో గ్రాండ్ ఓపెనింగ్ నిర్వహించబోతున్నట్లు టాక్ నడుస్తుంది.. ఇటీవల మల్టీప్లెక్స్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, రవితేజ మల్టీప్లెక్స్‌కు కూడా ప్రేక్షకాదరణ బాగానే ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి జూలైలో రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభం, హరి హర వీరమల్లు విడుదల.. ఈ రెండూ కలిపి టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ స్పెషల్ ఫీస్ట్‌గా మారనుంది.