ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో కొత్త ఏడాదికి శ్రీకారం చుట్టబోతున్నారు రవితేజ. మరి రవితేజను డైరెక్ట్ చేసే నెక్ట్స్ డైరెక్టర్ ఎవరు? అనే విషయంలో ఫిల్మ్ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలైంది. డైరెక్టర్ సురేందర్‌రెడ్డి పేరు గత కొన్ని రోజులుగా బలంగానే వినిపిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రవితేజ సినిమా దాదాపు ఖరారైనట్టు తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారట.
రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘కిక్’ చిత్రానికి కథను అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాక్కూడా కథను అందించారట. ఇటీవలే రవితేజ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కథను విని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించారు రవితేజ. వాటిలో ‘ధమాకా’ వందకోట్ల విజయాన్ని సాధించగా, తర్వాత వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం వినిపిస్తున్న వార్త నిజమైతే.. రవితేజ హీరోగా పీపుల్ మీడియా నిర్మించే నాలుగో సినిమా ఇదే అవుతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా మొదలవుతుందని తెలిసింది.