Raveena Tandon | జూన్ 12న అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానం AI171 ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 250కి పైగా మరణించారు. ప్రయాణికులలో మనదేశానికి చెందిన వారతో పాటు లండన్, పోర్చ్ గీస్, కెనడా జాతీయులు ఉన్నారు. ఈ ఘటనపై చాలా మంది సెలబ్రిటీలు వెంటనే స్పందించి విచారం వ్యక్తం చేశారు. అయితే బాలీవుడ్ నటి రవీనా టాండన్ కాస్త లేట్‌గా స్పందించి భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేసారు. ప్రమాదాలు ప్రయాణాలను ఆపలేవు! అనే సందేశంతో తన పోస్ట్ షేర్ చేసింది.
ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత విమానయాన సంస్థలపై, ముఖ్యంగా ఎయిరిండియా సేవలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేసిన ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం తరువాత, ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాలపై వార్తలు వెలువడటం, ప్రయాణికుల్లో ఆందోళనను పెంచింది. అయితే, ఈ తరుణంలో ఎయిరిండియా సిబ్బంది ప్రదర్శించిన వృత్తి నైపుణ్యం, మనోబలాన్ని రవీనా తన పర్సనల్ అనుభవంతో ప్రశంసించారు.తాజాగా ఎయిరిండియా విమానంలో ప్రయాణించిన రవీనా టాండన్, సిబ్బంది ధైర్యం, సేవానిరతిని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టింది.
కొత్త.. ప్రారంభాలు అన్ని కష్టాలను తట్టుకుని ముందుకెళ్లాలి. అహ్మదాబాద్ ఘటన అనంతరం తీవ్ర వేదనలో ఉన్నా కూడా, ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ, పూర్తి నిబద్ధతతో సేవలందిస్తున్నారు. ఇది ఎంతో ప్రేరణ కలిగించే అనుభవం. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది మానని గాయం. అయినా, ఎయిరిండియా మరోసారి బలంగా నిలబడుతుందని నమ్ముతున్నాను అంటూ విమానంలో విండో పక్కన కూర్చున్న పిక్స్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టింది. అంటే రవీనా టాండన్ ఎయిర్‌లైన్ సిబ్బందికి మానసికంగా ధైర్యం కలిగించేలా పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, రవీనా టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు అనే చిత్రంలో కథానాయికగా నటించింది.