‘నరుడు హరుడై రాక్షసుడ్ని ఎలా సంహరించాడు? అనే ప్రశ్నకు సమాధానమే మా ‘జాతర’. వాస్తవ సంఘటనలకు ఫిక్షన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ ఇది.’ అని సతీష్‌బాబు రాటకొండ అన్నారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. దియా రాజ్ కథానాయిక.
రాధాకృష్ణారెడ్డి, శివశంకర్‌రెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నటుడు, దర్శకుడు సతీష్‌బాబు రాటకొండ విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో హీరో పాత్రకు మూడు డైమన్షన్స్ ఉంటాయి. తను ఒక ఫేజ్ నుంచి మరో ఫేజ్‌కి వెళ్లేందుకు ప్రేమ అనేది ఒక మీడియంలా ఉపయోగపడింది. ఇది మంచి ప్రేమకథ కూడా. నిర్మాతల సపోర్ట్ వల్లే సినిమాను ఇంతబాగా తీయగలిగాను.’ అని సతీశ్‌బాబు చెప్పారు.
‘చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఓ అమ్మోరి గుడి.. ఆ చుట్టుపక్క గ్రామాల్లో ఫేమస్. ఏడాదిన్నర పాటు ఆ ప్రాంతంతో ఇంటరాక్ట్ అయి, రీసెర్చ్ చేసి ఈ స్క్రిప్ట్ రాశాను. స్థానిక మూలాలున్న కథ ఇది. అందుకే అక్కడి వాళ్లతోనే నటింపజేశాం. హీరోయిన్ దియా రాజ్ కూడా చక్కగా అభినయించింది. తప్పకుండా పెద్ద హీరోయిన్ స్థాయికి ఎదుగుతుంది. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు రాటకొండ సతీష్‌బాబు.