Rashmika | నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్న, తాజాగా తన వృత్తిపరమైన జీవితంలో ఎదురవుతున్న ఓ సమస్యను అభిమానులతో పంచుకున్నారు. తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు తనకు ఎంతటి కష్టం కలిగిస్తున్నాయో ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ఉదయం 3:50 గంటలకు విమానంలో కిటికీ ద్వారా తీసిన ఓ ఫొటోను షేర్ చేసిన రష్మిక, ‘‘ఉదయం 3:50 ఫ్లైట్లు చాలా దారుణం. ఇది రాత్రా? పగలా? అర్థం కావడం లేదు,’’ అంటూ కామెంట్ చేశారు. అలాంటి టైమింగ్స్‌కి ప్రయాణాలు చేయడం తాను చాలా బాధగా అనుభవిస్తున్నట్లు తెలిపారు.
‘‘రెండు గంటలు నిద్రపోయి లేచి పని చేయాలా? అలా చేస్తే రోజంతా నీరసం. లేక నిద్రపోకుండా పని చేసి తర్వాత నిద్రపోవాలా? అలా చేసిన అదే పరిస్థితి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా కష్టంగా మారుతోంది.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గమ్యం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వనప్పటికీ, రష్మిక బిజీ షెడ్యూల్ వల్ల నిత్యం ఇలా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని అర్థమవుతోంది. వృత్తిపరంగా రష్మిక ప్రస్తుతం బిజీగా ఉంది. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా సరసన ‘థమా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాంపైర్ల మిస్టరీతో కూడిన థ్రిల్లింగ్ కథగా ఈ చిత్రం రూపొందనుంది.
‘ముంజ్యా’ ఫేమ్ ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. దీపావళి 2025 కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.తెలుగులో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తున్నారు.ఇది రష్మికకు చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని ఆమె స్పష్టం చేశారు. GA2 పిక్చర్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత డిసెంబర్లో విడుదలైన టీజర్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా రష్మికకి సైమా అవార్డ్ దక్కిన విషయం తెలిసిందే. ఉత్తమ నటిగా అవార్డ్ దక్కించుకుంది.