Rashmika Mandanaa | దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా సత్తా చాటుతున్నది కన్నడ సోయగం రష్మిక మందన్న. ‘పుష్ప’ ‘యానిమల్’ చిత్రాలతో ఆమె హిందీ బెల్ట్‌లో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం రష్మిక మందన్న చారిత్రక చిత్రం ‘ఛావా’లో నటిస్తున్నది. విక్కీ కౌశల్ కథానాయకుడు. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా, ఆయన మొఘల్స్‌పై చేసిన అసామాన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో రూపొందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ పాటను 700 మంది డ్యాన్సర్లతో తెరకెక్కించబోతున్నారని తెలిసింది. శంభాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడయ్యే సందర్భంలో వచ్చే ఈ పాట కోసం సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. 16వ శతాబ్దం నాటి సంగీత వాయిద్యాలతో మరాఠీ జానపద శైలిలో ఏ.ఆర్.రెహమన్ ట్యూన్ సిద్ధం చేశారని తెలిసింది.
మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్ కోటలో ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. 700 మంది డ్యాన్సర్లు, 1000 మందికిపైగా జూనియర్ ఆర్టిస్టులతో ఈ పాటను కన్నులపండువగా తీర్చిదిద్దబోతున్నామని దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ చెప్పారు. ఇందులో కథానాయిక రష్మిక మందన్న నృత్యాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని అన్నారు. శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది.