Rashmika Mandanna | కన్నడ భామ రష్మిక మందన్న వరుస విజయాలతో తారాపథంలో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ఛావా చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఓ దక్షిణాది కథానాయిక అనతికాలంలోనే ఈ స్థాయి పేరుప్రఖ్యాతులు దక్కించుకోవడం అరుదైన విషమయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదిలావుండగా నేడు రష్మిక మందన్న జన్మదినం. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్నదీ భామ. అందుకు ఓమన్ దేశం వేదిక కానుంది. బిజీ షూటింగ్ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకున్న రష్మిక మందన్న ఇప్పటికే తన మిత్రబృందంతో కలిసి ఓమన్కు చేరుకుంది.
ఫ్యామిలీ మెంబర్స్, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రష్మిక బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనుందని తెలిసింది. ఇటీవల విడుదలైన ‘ఛావా’ చిత్రం అపూర్వ విజయంతో ద్విగుణీకృతమైన ఆనందంతో ఉంది రష్మిక మందన్న. దాంతో ఈ ఏడాది బర్త్‌డే చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తున్నదట. ప్రస్తుతం రష్మిక తెలుగులో కుబేర, గర్ల్‌ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నది.