సినీరంగంలో కొన్ని కాంబినేషన్లకు తిరుగులేని క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలో విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఒకటి. వీరిద్దరు కలిసి నటించిన ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు మంచి విజయాల్ని సాధించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సక్సెస్ఫుల్ జోడీ మరోమారు వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సినిమా అనంతరం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో నటించనున్నారు విజయ్ దేవరకొండ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్నను ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. కథానాయిక అన్వేషణలో చాలా మంది పేర్లను పరిశీలించిన చిత్రబృందం చివరకు రష్మిక మందన్న వైపు మొగ్గుచూపారని చెబుతున్నారు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, హిందీలో ‘తమా’ చిత్రాల్లో నటిస్తున్నది.