‘బయట నుంచి చూసేవారికి మనం సాధించిన విజయాలు అంత గొప్పగా ఏమీ అనిపించవు. ఏదో అదృష్టం ఉంది కాబట్టి పేరుప్రతిష్టలు వచ్చాయని భావిస్తారు. కానీ నా విజయాల వెనక ఆరేళ్ల కఠోర శ్రమ ఉంది. ఏదో అద్భుతాలతో నేనీ స్థాయికి రాలేదు’ అని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఎదిగిన ఈ భామ ప్రస్తుతం హిందీ సినిమాల్లో కూడా సత్తా చాటుతున్నది.
రణబీర్‌కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘యానిమల్’ చిత్రంలో కూడా ఈ అమ్మడే నాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక మందన్న తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. గత ఆరేళ్లుగా నిర్విరామంగా పనిచేస్తున్నానని, రాబోవు ఏడాది మరింత బిజీగా మారబోతున్నానని చెప్పింది.
‘రెండేళ్ల క్రితం అంగీకరించిన చిత్రాలు పాండమిక్ వల్ల ఆలస్యమయ్యాయి. జాన్ నెలతో ఈ సినిమాలు పూర్తిచేశా. మున్ముందు ఏ మాత్రం విశ్రాంతి దొరికే పరిస్థితులు కనిపించడం లేదు’ అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలో వరుస ఆఫర్లు వస్తున్నాయని, కథల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నానని ఆమె పేర్కొంది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో సీతా రామం, పుష్ప-2 చిత్రాల్లో నటిస్తున్నది. ‘సీతా రామం’ ఈ నెల 5న విడుదలకానుంది.