అగ్ర కథానాయిక రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఇటీవల ‘కుబేర’తో భారీ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి కథానాయకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రష్మిక మందన్న, దీక్షిత్శెట్టిలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయిందని, త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఓ జంట తాలూకు భావోద్వేగ ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ, అనూహ్య మలుపులతో సాగే ప్రేమకథ ఇదని, రష్మిక మందన్న పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి.