Rashmika Mandanna | ఈ ఏడాది ఇండియన్ సినీ పరిశ్రమలో రష్మిక మందన్నా సందడి ఎక్కువగా కనిపిస్తోంది. నెల, రెండు నెలల గ్యాప్‌లో ఓ సినిమా విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటివరకు ఆమె నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ‘పుష్ప 2’ తో రష్మిక తన సత్తా చాటుకోగా, ఈ ఏడాది ‘ఛావా’, ‘సికందర్’, ‘కుబేర’, ‘థామా’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రష్మిక నటించిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రష్మిక పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. షోలు, ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఆమె జగపతిబాబు హోస్ట్‌గా రన్ అవుతున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా రష్మిక తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంటూ, స్కూల్ రోజుల్లో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసింది. జగపతిబాబు అడిగిన ప్రశ్నలకు రష్మిక ఇచ్చిన సరదా సమాధానాలు ప్రేక్షకులను అలరించాయి. అంతేకాకుండా, షోలో రష్మిక మహిళలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడింది. “మగాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుండని అనిపించింది. ఆ సమయంలో మహిళలు ఎదుర్కొనే నొప్పి, బాధ ఎలా ఉంటుందో అబ్బాయిలు కూడా అనుభవిస్తే వారికి అర్ధం అవుతుందని చెప్పి అందర్నీ ఆకట్టుకుంది. ఆమె మాటలకు జగపతిబాబు, ఆడియెన్స్ ఇద్దరూ చప్పట్లు కొట్టారు.
ఇక రష్మిక నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరించారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ప్రేమకథలోని కొత్త కోణాన్ని చూపించబోతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయిలు తమ లవర్స్ గురించి ఆలోచించేలా ఉంటుందని ఆయన చెప్పడం విశేషం. ప్రస్తుతం రష్మిక మందన్నా ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. అదనంగా బాలీవుడ్లో ఒక కొత్త ప్రాజెక్ట్‌లోనూ భాగమవుతోంది. అంతేకాకుండా విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తోంది. పలు క్రేజీ ప్రాజెక్టులపై చర్చలు కొనసాగుతున్నాయని సినీ వర్గాల సమాచారం.