Rashmika Mandanna | నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ఈ మధ్య వార్తలలో తెగ నిలుస్తుంది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలూ, వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా యాక్టివిటీలతో ఆమె చుట్టూ ఎప్పుడూ హడావుడే ఉంటుంది. ఇటీవల ఆమెపై ట్రోలింగ్ తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, రష్మిక ఈసారి కాస్త ఘాటుగానే స్పందించింది. ఇటీవల విడుదలైన కన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాపై స్పందించలేదని, కనీసం అభినందనలు చెప్పలేదని కొంతమంది నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. ‘‘మీ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన గొప్ప సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడంలేదేంటి?’’ అంటూ కామెంట్లు పెట్టడంతో ఆమెకి చిర్రెత్తుకొచ్చింది.
ఈ క్రమంలో రష్మిక స్పందిస్తూ .. “ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజులకి చూసాను. వెంటనే టీమ్‌కి మెసేజ్ చేసి అభినందనలు కూడా తెలియజేశాను. తెర వెనక జరుగుతున్న విషయాలు అందరికీ కనిపించవు కదా. నేను ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకునే వ్యక్తిని కాదు. అందుకే ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. నా నటన గురించి వాళ్లు ఏం చెప్తారన్నదే నాకు ముఖ్యం,” అని తేల్చిచెప్పింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు ఈ పోస్ట్‌కు మద్దతుగా నిలవగా, కొంతమంది నెటిజన్లు ఇంకా విమర్శలు చేయడం కొనసాగిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో ‘థామా’ అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతుంది. ఈ సినిమాపై రష్మిక చాలా హోప్స్ పెట్టుకుంది. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన రష్మిక ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషలలోను వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇటీవలి కాలంలో రష్మిక నటించిన చాలా చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతుంది.