వరుస విజయాలతో తారాపథంలో దూసుకుపోతున్నది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ఇటీవలే ‘కుబేర’తో భారీ సక్సెస్‌ను అందుకున్న ఈ భామ తాజాగా ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఆమె ప్రధాన పాత్రలో ‘మైసా’ పేరుతో కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ఈ చిత్రం ద్వారా రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు హను రాఘవపూడి లాంచ్ చేశారు.
ఇందులో ముఖంపై రక్తపు మరకలతో కోపంగా చూస్తూ, తిరుగుబాటు నైజాన్ని ప్రతిబింబించే ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నది రష్మిక మందన్న. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకొని ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ఇందులో గోండు మహిళగా రష్మిక మందన్న కనిపిస్తుందని చిత్రబృందం తెలిపింది. ‘ధైర్యం ఆమె బలం.
ఆమె గర్జన వినడానికి కాదు. భయపెట్టడానికి..’ అంటూ మేకర్స్ సోషల్‌మీడియాలో పోస్టర్‌ను షేర్ చేశారు. ‘నేను ఇంతవరకు చేయని పాత్ర. చూడని ప్రపంచం ఇది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నమిది’ అంటూ రష్మిక మందన్న సినిమా గురించి వ్యాఖ్యానించింది. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: అన్‌ఫార్ములా ఫిల్మ్స్, దర్శకత్వం: రవీంద్ర పుల్లె.