అగ్ర కథానాయిక రష్మిక మందన్న బహుముఖప్రజ్ఞాశాలి. నటనతో పాటు పుస్తకపఠనం, చిత్రలేఖనంలో కూడా ఆమెకు మంచి ప్రవేశం ఉంది. ఇంగ్లీష్ సాహిత్యంలో పట్టభద్రురాలైన ఈ సొగసరి పుస్తకాలు బాగా చదువుతుంది. తాను చదివిన పుస్తకాల తాలూకు విశేషాలను సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటుంది. మంచి చదువరి కావడం వల్ల ఈ భామ మాటల్లో కాస్త ఫిలాసఫీ ధ్వనిస్తుంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తాను జీవితాన్ని మరీ సీరియస్‌గా తీసుకోనని, నిజాయితీగా పనిచేస్తూ ముందుకుసాగుతానని, ఏదో తెలియని శక్తి తనను నడిపిస్తుందని బలంగా విశ్వసిస్తానని చెప్పుకొచ్చింది.
రష్మిక మాట్లాడుతూ ‘అతిగా ఆలోచించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే సిన్సియర్‌గా నా పని పూర్తిచేయడంపైనే దృష్టిపెడతా. ఇక సినిమాల విజయంపై కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోను. ఎందుకంటే సమిష్టిగా చేసే పనిలో విజయం ఏ ఒక్కరిపైనా ఆధారపడి ఉండదు’ అని పేర్కొంది. సినిమాల ఎంపికలో తాను కథకే అత్యంత ప్రాధాన్యం ఇస్తానని, కథ నచ్చితే తల్లి పాత్రలే కాదు బామ్మ పాత్ర చేయడానికి కూడా ఆలోచించనని రష్మిక మందన్న తెలిపింది. ఈ భామ నటించిన హిందీ చిత్రం ‘ఛావా’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.