అగ్ర కథానాయిక రష్మిక మందన్న ఓవైపు వాణిజ్య చిత్రాల్లో సత్తాచాటుతూనే మరోవైపు మహిళా ప్రధాన ఇతివృత్తాల మీద దృష్టిపెడుతున్నది. ఇప్పటివరకు యాక్షన్ ప్రధాన పాత్రలో కనిపించని ఈ కన్నడ సోయగం తాజాగా ’మైసా’ చిత్రంలో ధీరవనిత పాత్రలో పోరాటానికి సిద్ధమవుతున్నది. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది. సోమవారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో రష్మిక మందన్న చేతిలో తుపాకీ పట్టుకొని తెగిన సంకెళ్లతో కనిపిస్తున్నది. గోండు తెగ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుందని, తన జాతి రక్షకురాలిగా ఆమె పాత్ర ధైర్యసాహసాలతో సాగుతుందని, త్వరలో గ్లింప్స్‌ను విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్.