ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సమాజంలోని ఆర్థిక అసమానతలను చర్చిస్తూ సందేశాత్మక ఇతివృత్తంతో దర్శకుడు శేఖర్ కమ్ముల స్క్రిప్ట్ సిద్ధం చేశారు.
ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్నను ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారం చిత్ర బృందం ప్రకటించింది. ధనుష్ సరసన రష్మిక మందన్న నటించబోతున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని రష్మిక మందన్న పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.