Rashmika Mandanna | ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా వినూత్న కథాంశాల్లో నటించే అవకాశం లభిస్తున్నదని, తన కెరీర్లో ఇదొక కీలకమైన సమయమని వ్యాఖ్యానించింది రష్మిక మందన్న. స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో తన అభిప్రాయాలు చాలా మారాయని, ఇప్పుడు సవాలుతో కూడిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘పాన్ ఇండియా నటిగా అన్ని భాషల వాళ్లను మెప్పించేలా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నా.
పుష్ప-2, హిందీలో ‘ఛావా’ వంటి చిత్రాలను ఓ సవాలుగా తీసుకున్నా. నటిగా నాలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నా. తెరపై చూసుకున్నప్పుడు నాకు నేనే సర్ప్రైజ్గా అనిపించాలి. అలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది. సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్, వ్యక్తిగత విమర్శల గురించి మాట్లాడుతూ ‘అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి నాలోని ఎనర్జీని వృథా చేసుకోను.
నేను ప్రతీ విషయంలో ఆశావహదృక్పథంతో ఉంటాను. సినీ రంగంలో సహనం అన్నింటికంటే చాలా ప్రధానమైనది. కాస్త ఓపిక పడితే చాలు ప్రతీకూల పరిస్థితులన్నీ సర్దుకుంటాయని ఈ ప్రయాణంలో అర్థం చేసుకున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగు, హిందీ భాషల్లో ఆరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.