సినిమాల ఎంపికలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటానని, ఎవరి సూచనలు..సలహాలు పాటించనని చెప్పింది అగ్ర నాయిక రష్మిక మందన్న. కర్ణాటకలో ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన కూర్గ్ ప్రాంతం నుంచి వచ్చిన ఈ సొగసరి సమకాలీన భారతీయ సినిమాలో తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతున్నది. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ఆమెను ప్రేమగా పిలుచుకుంటారు. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ఛావా సినిమాలతో ఈ అమ్మడి పాపులారిటీ పతాకస్థాయికి చేరింది. ఆమె సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘సికందర్’ చిత్రం నేడు విడుదలకానుంది.
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న కెరీర్‌పరంగా తన ఎంపికలపై ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ‘సినిమాల విషయంలో మన ఎంపికలే మనల్ని గొప్పస్టార్స్గా నిలబెడతాయి’ అని ఓ పుస్తకంలో చదివిన మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని, వివిధ భాషా చిత్రాల్లో నటించాలన్నది తన స్వీయ నిర్ణయమని, భవిష్యత్తులో మలయాళంలో కూడా నటిస్తానని రష్మిక మందన్న తెలిపింది. కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ వెనకడుగు వేయననని, తన నిర్ణయాల పర్యవసానాలను తానే ఎదుర్కొంటానని, అంకితభావంతో పనిచేస్తే పోటీతత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చింది రష్మిక.