Rashmika Mandanna | రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ చిత్ర సక్సెస్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అలానే తన మాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా చూశాను. చాలా సార్లు కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. ఇది నేను ఇటీవల చూసిన గొప్ప చిత్రాల్లో ఒకటి. రష్మిక కూడా చాలా కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది.
ఎవరు ఎగతాళి చేసినా, విమర్శించినా ఆమె దానిని పట్టించుకోదు. కేవలం తన కెరీర్‌పై దృష్టి పెట్టి ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది. ఆమె నిజంగా ఒక అద్భుతమైన మహిళ. ఒకరోజు ప్రపంచం నీ ప్రతిభను గుర్తిస్తుంది అని నేను చెప్పాను… అది నిజమైంది,” అంటూ రష్మికను ప్రశంసించారు. విజయ్ మాటలు విన్న రష్మిక భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ఆమె మాట్లాడుతూ ..“‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ప్రారంభం నుంచి సక్సెస్ అయ్యే వరకు విజయ్ కూడా మా టీమ్‌లో ఒక భాగంలా ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి ఉండటం నిజంగా ఒక ఆశీర్వాదం,” అని చెప్పడంతో ఆడిటోరియం దద్దరిల్లింది. ఈ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఎమోషనల్ మోమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
`ది గర్ల్ ఫ్రెండ్` చిత్రం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ చిత్రాన్ని ధీరణ్ మొగిలినేని, దివ్య నిర్మించారు. దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా ప్రధాన పాత్ర పోషించింది. ఆమె నటించిన తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అదే సమయంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. దీనికి విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఇందులో రష్మిక మాట్లాడుతూ ఎమోషనల్ కావడం, విజయ్.. రష్మిక చేతిని ముద్దాడడం ఈవెంట్‌కి హైలైట్‌గా నిలిచాయి.