సంసిద్ధంగా ఉన్నవారినే అదృష్టం వరిస్తుందంటారు. ఈ మాటలు అగ్ర కథానాయిక రష్మిక మందన్న విషయంలో నిజమనిపిస్తాయి. కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో (2016) సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ కూర్గ్ సొగసరి పదేళ్ల ప్రస్థానంలో జాతీయస్థాయిలో తిరుగులేని పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంది. నటిగా ప్రతీ సినిమాలో పరిణతి సాధిస్తూ, పాత్రలపరంగా సవాళ్లను స్వీకరిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నది.
ముఖ్యంగా ‘పుష్ప’ ఫ్రాంఛైజీతో రష్మిక మందన్న పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలో కూడా ఆమెకు భారీ చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక మందన్నకు పెద్ద మొత్తంలో పారితోషికాలను ఆఫర్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
తాజా సమాచారం ప్రకారం హిందీ చిత్రం ‘కాక్టెయిల్-2’కోసం రష్మిక మందన్న 15కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. షాహిద్‌కపూర్, కృతిసనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘కాక్టెయిల్-2’ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘పుష్ప’ ఫ్రాంఛైజీతో పాటు యానిమల్, ఛావా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు బాలీవుడ్లో రష్మిక మందన్న స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ నేపథ్యంలో ఆమెకు భారీ పారితోషికాలు అందివ్వడానికి బాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో రణబాలి, మైసా చిత్రాల్లో నటిస్తున్నది.