హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కంచె గచ్చిబౌలి అటవీ భూముల్లో వేలం పేరిట రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై సినీ ప్రముఖుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్‌గా అభివర్ణించే ఈ ప్రాంతంలో చెట్ల నరికివేతను వెంటనే ఆపాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని సోషల్‌మీడియా వేదికగా వారు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్, దర్శకుడు నాగ్అశ్విన్ స్పందించగా..తాజాగా అగ్ర కథానాయికలు కొందరు తెలంగాణ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పారు. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి మద్దతు ప్రకటిస్తూ, అటవీ ధ్వంసాన్ని వెంటనే ఆపాలని కోరారు.
HCU | మంగళవారం హెచ్‌సీయూ ఘటనపై తన స్పందనను తెలియజేసిన సీనియర్ నటి రేణూదేశాయ్ మరోమారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ‘ప్రజలందరి పక్షాన ఈ వీడియో ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు రెండు రోజుల క్రితం హెచ్‌సీయూ ఘటనల గురించి తెలిసింది. మిత్రుల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించి ఈ వీడియోతో ముందుకొచ్చాను. సీఎంగారు..ఓ తల్లిగా నేను మిమ్మల్మి అభ్యర్థిస్తున్నా. మన భవిష్యత్తు తరాల కోసం ఆక్సిజన్, చెట్లు అవసరమవుతాయి. ఐటీ పార్కులు, ఆకాశహర్మ్యాలతో కూడిన అభివృద్ధి అవసరమే.. కానీ ఈ 400 ఎకరాల భూమిని మాత్రం వదిలివేయమని మిమ్మల్ని కోరుతున్నా. తెలంగాణలో నివసిస్తున్న పౌరురాలిగా మీకు నా అభ్యర్థన ఇది. అభివృద్ధి చేయాలంటే ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆక్సిజన్ కోసం మనకు చక్కటి పర్యావరణం అవసరం కాబట్టి ఆ 400 ఎకరాలను వదిలిపెట్టమని అడుగుతున్నా. హెచ్‌సీయూ భూముల వేలం విషయంలో మీరు, మీ అధికారులందరూ పునరాలోచన చేసి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. మరో పోస్ట్‌లో… కోర్టు ఆదేశాలను ధిక్కరించి బుధవారం సాయంత్రం కూడా అటవీ ధ్వంసం చేశారని రేణూదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.