ఈ ఏడాదిని రష్మిక నామ సంవత్సరం అనంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. ఈ ఏడాదంతా పానిండియా రేంజ్లో అదరగొట్టేసింది రష్మిక. చావా, సికిందర్, థమ్మా.. మూడు బాలీవుడ్ సినిమాలు. తెలుగు, తమిళ బైలింగ్వెల్”కుబేరా’. అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది గాళ్‌ఫ్రెండ్’. ఒక్క ఏడాదిలోనే అయిదు సినిమాలు. ఈ ఏడాదిలో ఇన్ని సినిమాలు చేసిన హీరోయిన్ లేదు. ప్రస్తుతం హిందీ ‘కాక్టెయిల్’, తెలుగు ‘మైసా’ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాత్రల ఎంపిక విషయంలో తనలో వచ్చిన మార్పు గురించి ఆసక్తికరంగా మాట్లాడింది రష్మిక.
‘నటిగా సినిమా సినిమాకీ బాధ్యత పెరుగుతూనే ఉంది. ఇప్పుడు పాత్రల కోసం వెంపర్లాడే స్థితి నుంచి, మంచి పాత్ర కోసం ఆరాటపడే స్థాయికి చేరుకున్నాను. డబ్బు కోసం మాత్రమే సినిమాలు చేసే రోజులు పోయాయి. ప్రస్తుతం నా కోసం రచయితలు ప్రత్యేకంగా కథలు తయారు చేస్తున్నారు. ఓ విధంగా ఇది నా విజయం. ఫలానా తరహా పాత్రలే చేయాలని అనుకోవడం లేదు. నా కంటే రచయితలనే ఈ విషయంలో ఎక్కువగా నమ్ముతాను. నాకు సూటయ్యే పాత్రలనే వారు నా దగ్గరకు తెస్తారని నా నమ్మకం.’ అని తెలిపింది రష్మిక.