 
                                                            Jani Master In Ram Charan Movie | మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొని గతంలో జైలు జీవితం గడిపిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) రీఎంట్రీపై టాలీవుడ్లో పెద్ద దుమారం రేగుతోంది. ఆయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’కి కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా అతడిని చిత్రబృందం నియమించడంపై నెట్టింట తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని, పోక్సో (POCSO) చట్టం కింద అరెస్ట్ అయిన వ్యక్తికి మళ్లీ సినీ పరిశ్రమలో పెద్ద హీరో సినిమాలో పనిచేసే అవకాశం ఎలా ఇస్తారంటూ నెటిజన్లు, సినీ వర్గాలు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నాయి. సినిమా అనేది సమాజంపై బలంగా ప్రభావం చూపే మాధ్యమం. అటువంటి మాధ్యమంలో మహిళలపై నేరాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను తిరిగి తీసుకోవడం ద్వారా టాలీవుడ్ ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకుందని పెద్ది చిత్ర బృందంని పలువురు నిలదీస్తున్నారు.
రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో పాటు వృద్ధి సినిమాస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు నైతిక విలువలను మర్చిపోయి.. వివాదాస్పద వ్యక్తులకు పని కల్పించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రతిభ ఉందనే కారణంతో తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొన్నవారిని ప్రోత్సహించడం సినీ పరిశ్రమ నైతికతను ప్రశ్నిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్టులో జానీ మాస్టర్‌కు అవకాశం ఇవ్వడం, టాలీవుడ్ పరిశ్రమలో ‘మీ టూ’ (Me Too) ఉద్యమం స్ఫూర్తిని, మహిళా భద్రత పట్ల ఉన్న నిబద్ధతను నీరుగార్చిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై రామ్ చరణ్ లేదా ‘పెద్ది’ చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ అంశంపై చిత్ర బృందం స్పందన కోసం మీడియా మరియు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
 
                            