Ranveer Singh | బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్‌సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను మొత్తం డిలీట్ చేశారు. 2023కు ముందున్న ఫొటోలన్నీ తీసివేయడంతో అభిమానులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. రణ్‌వీర్‌సింగ్-దీపికా పదుకొణె జంట విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా బాలీవుడ్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను దీపికా పదుకొణే ఓ ఇంటర్వ్యూలో ఖండించింది. తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని తెలిపింది.
తాజాగా రణ్‌వీర్‌సింగ్ ఫొటోలు డిలీట్ చేసిన సంఘటనతో వీరి బంధంపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే రణ్‌వీర్‌సింగ్ ఫొటోలను కావాలని తొలగించలేదని, ఏదైనా సాంకేతిక లోపం కారణంగా అలా జరిగి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో రణ్‌వీర్‌సింగ్ స్పందిస్తేనే స్పష్టత వస్తుందంటున్నారు. రణ్‌వీర్‌సింగ్-దీపికా పదుకొణే జంట 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్‌లో వీళ్లు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో రణ్‌వీర్‌సింగ్ తన ఇన్‌స్టా ఖాతా నుంచి పెళ్లి ఫొటోలను డిలీట్ చేయడం అభిమానులను కలవరపరుస్తున్నది. ప్రస్తుతం దీపికా పదుకొణే తెలుగులో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.