Rani Mukerji | సినీ తారలూ మనుషులే. వారికీ కష్టాలూ, కన్నీళ్లూ ఉంటాయి. సెలెబ్రిటీలు అయినంత మాత్రాన వారి జీవితం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటే పొరపాటు. చాలామంది నటీనటులు తమ జీవితంలోని ఒడుదొడుకుల గురించి పంచుకుంటూ ఉంటారు. బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ కూడా తన జీవితంలో ఎదురైన విపత్కర పరిస్థితులను ఇటీవల ఓ వేదికపై షేర్ చేసుకున్నది.
‘కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలోనే నా జీవితంలో కూడా విషాదం చోటుచేసుకుంది. 2020లో రెండోసారి గర్భం దాల్చాను. దురదృష్టవశాత్తు 5 నెలలకే బిడ్డను కడుపులోనే కోల్పోయాను. ఈ సంఘటన గురించి ఎవ్వరికీ తెలియదు. కొన్ని విషయాలను బయటకు చెబితే సినిమా ప్రమోషన్ల కోసం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ప్రమోషన్స్ చేసే సమయంలో నా వ్యక్తిగత విషయాలను ప్రస్తావించను’ అని తన జీవితంలోని చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నదామె.
ఈ సంఘటన తర్వాత పది రోజులకు నిర్మాత నిఖిల్ అద్వానీ ఫోన్ చేసి ‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’ సినిమా కథ చెప్పారని ఆమె పేర్కొన్నది. ‘నార్వే లాంటి దేశంలో ఒక భారతీయ కుటుంబం అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదా అంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. కానీ, నిజమని తెలిశాక వెంటనే ఆ చిత్రానికి ఓకే చెప్పాను’ అని చెప్పుకొచ్చింది రాణి.