సాయిపల్లవి, రణబీర్‌కపూర్ సీతారా ములుగా.. బాలీవుడ్లో ‘రామాయణ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ పవిత్ర ఇతిహాసాన్ని దర్శకుడు నితీశ్ తివారి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందరికీ తెలిసిన కథైన రామాయణాన్ని రెండు భాగాలుగా చూపించడం సముచిత నిర్ణయమే అయినా.. తొలి భాగాన్ని ఎక్కడితో ముగించాలి? అనేది మాత్రం దర్శకుడికి పెద్ద టాస్క్.
ఎందుకంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా అందరికీ తెలుసు. తెలిసినా.. ఆ తొలిభాగం ముగింపు మాత్రం ఆసక్తిగా ఉండాలి. ఈ విషయంపై చిత్రబృందం ఓ స్పష్టతనిచ్చింది. రావణుడి చేతిలో గాయపడ్డ జటాయువు.. సీతాపహరణ వృత్తాంతాన్ని రాముడికి విశదపరచి ఆయన చేతిలోనే మరణించడంతో తొలి భాగం ముగుస్తుందని వివరించింది.
ఇందులో జటాయువు పాత్రకు అమితాబచ్చన్ డబ్బింగ్ చెప్పనున్నారు. ఇక అసలు యుద్ధం పార్ట్ 2లో ఉంటుంది. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 4వేల కోట్లతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా అద్బుతంలో తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి, మలిభాగం 2027 దీపావళికి రానున్నాయి.