Rana Daggubati | బాహుబలి, రానా నాయుడు చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకున్న నటుడు రానా ఒకవైపు సినిమాల్లో నటిస్తునే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘స్పిరిట్ మీడియా’ (Spirit Media) అనే పేరుతో బ్యానర్‌ను స్థాపించిన ఈ కుర్ర హీరో పలు చిత్రాలను ఇప్పటికే నిర్మిస్తున్నాడు. అయితే ఈ బ్యానర్ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్లో తన మొదటి చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, గ్లోబల్ స్థాయిలో నిర్మించేందుకు రానా సిద్ధమయినట్లు తెలుస్తుంది. ప్రముఖ రచయిత అరవింద్ అదిగ రాసిన సంచలనాత్మక నవల ‘లాస్ట్ మాన్ ఇన్ టవర్’ (Last Man in Tower) ఆధారంగా ఒక సినిమా తెరకెక్కుతుండగా.. ఈ చిత్రాన్ని రానా నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో మనోజ్ బాజ్పేయీ కథానాయకుడిగా నటించబోతున్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్ దర్శకుడు బెన్ రేఖీ దర్శకత్వం వహించనున్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని రానా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
స్పిరిట్ మీడియా తొలి నిర్మాణ ప్రాజెక్ట్ ‘కాంతా’ విడుదలకు ముందు జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో రానా ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ “సృజనాత్మక ఆలోచనలు కలిగిన రచయితలు, దర్శకులను ప్రోత్సహించడం నా లక్ష్యం. వివిధ భాషల్లోని నిర్మాతలు, క్రియేటర్లతో కలిసి పనిచేస్తూ కొత్త తరహా కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాను” అని తన విజన్‌ను పంచుకున్నారు. 2005లో స్థాపించిన స్పిరిట్ మీడియా ఇప్పటికే కంటెంట్ డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూషన్, టాలెంట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో దూసుకుపోతోంది. ‘కాంతా’తో పాటు, ‘డార్క్ చాకొలెట్’, ‘సైక్ సిద్ధార్థ్’, ‘ప్రేమంటే’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఈ బ్యానర్‌పై రూపొందుతున్నాయి.