Ramya Krishna |తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లోనే ఎవర్ గ్రీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహ’) మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది. రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని ఈ నెల 12న థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది.రజనీకాంత్ సరసన సౌందర్య, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ముఖ్యంగా నీలాంబరి పాత్ర సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఆ పాత్రకు ప్రాణం పోసిన రమ్యకృష్ణ నటన ఇప్పటికీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
రీ రిలీజ్ సందర్భంగా తాజాగా రమ్యకృష్ణ స్వయంగా థియేటర్లో ‘పడయప్ప’ను వీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “ఫస్ట్ టైమ్ ‘పడయప్ప’ మూవీని థియేటర్లో చూశాను” అని పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ – రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్స్ ఇప్పటికీ అభిమానులకు ప్రత్యేకం. ముఖ్యంగా నీలాంబరి అజ్ఞాతవాసం ముగించుకుని, చాలా ఏళ్ల తర్వాత ‘నరసింహ’ను ఎదుర్కొనే సీన్ సినీ చరిత్రలోనే ఐకానిక్‌గా నిలిచింది. డైలాగ్స్, బీజీఎం, ఇద్దరి నటన థియేటర్లో మరోసారి గూస్బంప్స్ తెప్పించాయి.
ఆ సీన్ వచ్చిన సమయంలో థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి రమ్యకృష్ణ కూడా ఆ క్షణాలను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ, “నీలాంబరి ఇస్ నాట్ జస్ట్ ఎ క్యారెక్టర్… ఇట్’స్ ఎ లెజెండ్” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రీ రిలీజ్ అయినప్పటికీ ‘పడయప్ప’కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే… ఈ సినిమా నిజంగా క్లాసిక్ అని మరోసారి నిరూపితమవుతోంది.