స్త్రీ భార్యగా మారినప్పుడే ఆమె అసలైన అవతారం బయటికి వస్తుందని అంటున్నారు అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. వివాదాస్పద అంశాల్ని స్పృశిస్తూ సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంటారాయన. ఈ మధ్య వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న రామ్‌గోపాల్‌వర్మ తాజాగా భార్యల మనస్తత్వాలు, వారి భిన్న స్వభావాల ఆధారంగా ‘రకరకాల భార్యలు’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇందులో ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రామ్‌గోపాల్‌వర్మ సిరీస్ కాన్సెప్ట్‌ను తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఎంతోమంది కవులు, మహానుభావులు స్త్రీని అనేక రకాలుగా వర్ణించారు. అయితే కాలప్రవాహంలో రకరకాల మనస్తత్వం కలిగిన భార్యలు ఉద్భవిస్తారనే విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు. ఈ సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్లో ఒక్కోరకం మనస్తత్వం కలిగిన భార్య గురించి వివరిస్తాను. ఒక మగవాడికి ఎలాంటి భార్య దొరికితే వాడి బ్రతుకు ఎలా తయారవుతుందనే అంశాన్ని చూపిస్తాను. ఈ సిరీస్ రెండో సీజన్‌ను ‘రకరకాల భర్తలు’ పేరుతో తెరకెక్కిస్తా’ అన్నారు.