Ramcharan | రామ్ చరణ్ ప్రస్తుతం పర్సనల్ టైం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మధ్యే తండ్రి కావడంతో మరికొన్ని రోజులు కుటుంబంతో సమయం కేటాయించాలని భావిస్తున్నాడు రామ్ చరణ్. దాంతో ఈయన కెమెరా ముందుకు రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ టైమ్ పూర్తిగా వాడుకుంటున్నాడు దర్శకుడు శంకర్. ఆ మధ్య చరణ్, కమల్ హాసన్ సినిమాలు ఒకేసారి చేసిన ఈయన.. ఇప్పుడు దొరికిన గ్యాప్‌లో ఇండియన్ 2 పూర్తి చేస్తున్నాడు. రామ్ చరణ్ మళ్లీ షూటింగ్‌కు వచ్చేలోపు కమల్ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు వరకు ఇండియన్ 2 పూర్తి కానుంది. ఈ సినిమా డిసెంబర్లో లేదంటే సంక్రాంతి విడుదల కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు శంకర్.
గేమ్ చేంజర్ చిత్ర షూటింగ్ ఆగస్టు నుంచి రీస్టార్ట్ చేసి నవంబర్ లోపు పూర్తి చేయాలి అనేది దర్శక నిర్మాతల ప్లాన్. డిసెంబర్ నుంచి బుచ్చిబాబు సినిమాతో బిజీ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైపోయింది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సాగే స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు సినిమా వస్తుంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తోంది. స్వాతంత్రానికి పూర్వం జరిగే కథతో ఈ సినిమా రాబోతుంది. దీనికి పెద్ది అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ఇది. రంగస్థలం సినిమాను మించిన రూరల్ కథతో ఈ సినిమా రాబోతుంది.
ఉప్పెన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక కథ చెప్పిన బుచ్చిబాబు.. అది వర్కవుట్ అవ్వకపోవడంతో రామ్ చరణ్‌కు మరో కథ చెప్పి ఒప్పించాడు. అది ఇది ఒకటి కాదు అని వాళ్లు చెప్తున్నారు. కాకపోతే ఈ రెండు సినిమాల కథ ఒకటే అని.. చరణ్ కోసం కొన్ని మార్పులు చేశాడు తప్ప మెయిన్ స్టోరీ మాత్రం అదే అని ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు.
చాలా సంవత్సరాల తర్వాత నేరుగా ఒక తెలుగు సినిమాకు రెహమాన్ పని చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి 2024 దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు వర్కౌట్ కాకపోతే 2025 సంక్రాంతికి సినిమా రానుంది. ఈ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకుంటున్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే తాజాగా గేమ్ చేంజర్ సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రామ్ చరణ్. తండ్రీకొడుకులుగా ఇందులో నటిస్తున్నాడు మెగా వారసుడు.