actress Rambha | ప్రముఖ నటి రంభ కారు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పాఠశాల నుంచి పిల్లల్ని తీసుకొస్తున్న సమయంలో ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నటి స్వల్ప గాయాలతో బయటపడగా.. ఆమె కుమార్తె మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని రంభ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోను షేర్ చేసింది.
‘‘పిల్లలను పాఠశాల నుంచి తీసుకువస్తుండగా.. దారి మధ్యలో మా కారును మరో కారు ఢీ కొట్టింది. ఆ సమయంలో కారులో నాతోపాటు పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేం అందరం సేఫ్‌గా ఉన్నాం. చిన్నారి షాషా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాకు బ్యాడ్‌టైమ్ నడుస్తోందనుకుంటా. షాషా త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అంటూ పోస్టు చేశారు.
రంభ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జేడీ చక్రవర్తి తదితర స్టార్స్‌తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటూ.. భర్తతో కలిసి విదేశాల్లో సెటిలయ్యారు. రంభకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.