Ramayana | బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ గురించి ఒక సంచలన వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా రామాయణం కథ అనగానే శ్రీరాముడి బాల్యం లేదా జననంతో మొదలవుతుందని మనందరికీ తెలుసు, కానీ ఈ చిత్రంలో దర్శకుడు నితీష్ తివారీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రావణుడిగా నటిస్తున్న కన్నడ సూపర్ స్టార్ యష్ పవర్ఫుల్ ఎంట్రీతో, రావణ-కుబేర యుద్ధంతో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. తన సోదరుడైన కుబేరుడిపై దాడి చేసి, స్వర్ణ లంకను మరియు పుష్పక విమానాన్ని రావణుడు స్వాధీనం చేసుకునే ఘట్టాన్ని అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై చూపించబోతున్నట్లు సమాచారం.
భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రత్యేక స్క్రీనింగ్‌లో ప్రదర్శించిన 20 నిమిషాల ఫుటేజీ చూసిన విశ్లేషకులు, ముఖ్యంగా లంకా నగరం మరియు రావణుడి యుద్ధ సన్నివేశాల్లోని VFX హాలీవుడ్ స్థాయిని మించి ఉన్నాయని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రావణుడి శక్తిని, ప్రతాపాన్ని చూపే ఈ విజువల్ స్పెక్టాకిల్ మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.