నవీన్ బేతిగంటి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ ట్రైలర్ను దర్శకుడు శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునే ఓ యువకుడి జీవితంలో ఎదురైన పరిస్థితులేమిటనేదే ఈ సినిమా కథాంశం. ట్రైలర్ బాగుంది. ఇలాంటి కొత్త వాళ్లు వైవిధ్యమైన ఆలోచనలతో ఇండస్ట్రీకి రావాలి. నేనూ ఇలా చిన్న సినిమాలతోనే ప్రయాణం ప్రారంభించాను’ అన్నారు.
హీరో, దర్శకుడు నవీన్ బేతిగంటి మాట్లాడుతూ…‘ఈ సినిమాలో కథే హీరో. ఆరు ప్రధాన పాత్రల మధ్య సినిమా సాగుతుంటుంది. రాజకీయాల్లో కింది స్థాయిలో తిరిగే యువకుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? మిగతా ప్రధాన పాత్రలు అతని జీవితంలోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాయి అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం’ అన్నారు. నటుడు అనిల్ గీల మాట్లాడుతూ…‘కెరీర్ ప్రారంభంలో ఉన్న మాలాంటి నటులకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాలని కోరుకుంటాం. ఈ చిత్రంలో అలాంటి కీలక పాత్రలో నటించాను’ అని అన్నారు.