రామ్ పోతినేని, పూరీజగన్నాథ్ల ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర అవుతున్న కొద్దీ ప్రమోషన్స్‌ని చిత్రబృందం వేగవంతం చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నదని, ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటలు ఆడియన్స్‌ని అలరిస్తున్నాయని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సోమవారం ఈ సినిమాకు చెందిన మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘క్యా లఫ్డా.. క్యా లఫ్డా.. క్యా లఫ్డా హే.. వై రబ్బా.. వై రబ్బా.. వై రబ్బా వై.. నాకే ఎందుకిలా అయితాందిరా భాయ్..’ అంటూ సాగే ఈ పాటను శ్రీహర్ష ఈమని రాయగా, మణిశర్మ స్వరపరిచారు. ధనుంజయ్ సీపాన, సింధూజ ఆలపించారు. మోస్ట్ రొమాంటిగ్గా, ట్రెండీగా ఈ పాటను పూరీ తెరకెక్కించినట్టు పాట చూస్తే అర్థమవుతుంది. కావ్యా థాపర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సంజయ్‌దత్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. సామ్ కె.నాయుడు, జియాని జియాన్నెలి ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీజగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మించారు.