ఒకప్పుడు కల్ట్ మూవీస్‌తో తెలుగు, హిందీ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ గత కొంతకాలంగా రేసులో వెనకబడ్డారు. ఆయన స్థాయికి తగిన సినిమాలు రావడం లేదని అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. తాను ఇప్పటివరకు హారర్, గ్యాంగ్‌స్టర్, రొమాంటిక్, పొలిటికల్ డ్రామాస్, అడ్వెంచర్ థ్రిల్లర్స్ చేశానని, కానీ కెరీర్లో తొలిసారి హారర్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నానని రామ్‌గోపాల్‌వర్మ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
ఈ సినిమాకు ‘పోలీస్‌స్టేషన్ మే భూత్’ అనే టైటిల్ ఖరారు చేశానని..‘యూ కాంట్ కిల్ ది డెడ్’ అన్నది ట్యాగ్‌లైన్ అని ఆయన తెలిపారు. ‘మనకు భయమేస్తే పోలీస్‌స్టేషన్‌కు వెళ్తాం. కానీ పోలీసులే భయపడే పరిస్థితి వస్తే వాళ్లు ఎక్కడకు పోతారు?’ అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. ఓ భయంకరమైన ఎన్కౌంటర్ తర్వాత పోలీస్‌స్టేషన్ హాంటెడ్ స్టేషన్‌గా మారుతుంది. చనిపోయిన గ్యాంగ్స్టర్స్ దెయ్యాలుగా మారి పోలీసులను ఇబ్బంది పెడుతుంటారు. ఇదే సినిమా కథాంశం. ఇందులో వీఎఫ్ఎక్స్కు చాలా ప్రాధాన్యత ఉంటుంది’ అని వర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.