నిత్యం వివాదాలతో సహవాసం చేసే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోమారు చిక్కుల్లో పడ్డారు. 2018 నాటి చెక్‌బౌన్స్ కేసులో ముంబయిలోని ఆంథేరి కోర్టు ఆయనకు మూడు నెలల జైలుశిక్ష విధించింది. ఈ కేసు విచారణకు రామ్‌గోపాల్‌వర్మ గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.
2018లో మశ్చీంద్ర మిశ్రా అనే వ్యక్తి తరపున ఓ కంపెనీ ఈ కేసు దాఖలు చేసింది. 2022 జూన్‌లో వర్మ ఈ కేసు విషయంలో బెయిల్ తెచ్చుకున్నారు. కోర్టు తీర్పుపై రామ్‌గోపాల్‌వర్మ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తన మాజీ ఉద్యోగికి సంబంధించిన కేసు ఇదని, తన న్యాయవాదులు ఈ కేసును చూసుకుంటారని, కోర్టులో కేసు ఉన్నందువల్ల తీర్పుపై తానేమీ మాట్లాడబోనని పేర్కొన్నారు.