Ram Charan | ప్రముఖ నటుడు రామ్ చరణ్ ఖాతాలో మరో కీర్తి కిరీటం చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌డమ్‌ని సంపాదించుకున్న రామ్ చరణ్ తన క్రేజ్ మరింత పెంచుకుంటున్నాడు. తాజాగా ఆయన లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఆవిష్కరించారు. ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ నటుడిగా చరణ్ చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా పాలుపంచుకున్నారు. చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని లాంచ్ చేసారు.. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం చరణ్ స్వయంగా తన చేతుల మీదుగా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వెలసిన తన మైనపు విగ్రహంతో కలిసి రామ్ చరణ్ ఫోటోలకు పోజులు ఇచ్చారు. రామ్ చరణ్ తన పెట్ డాగ్ రైమ్‌తో కలిసి ఫొటోలకి పోజులిచ్చారు. అయితే టుస్సాడ్స్ చరిత్రలోనే పెంపుడు కుక్కతో ఓ సెలబ్రిటీ వాక్స్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. అయితే మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు ప్రతిమ ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు రామ్ చరణ్ తనతో పాటు తన పెట్ డాగ్ రైమ్ బొమ్మని కూడా ఉంచాలని షరతు పెట్టారట. దానికి ఓకే అనడంతో కొలతలు తీసుకొని టుస్సాడ్స్‌లో విగ్రహం ఆవిష్కరణ చేశారు.
అయితే రైమ్ తన మైనపు బొమ్మని చూసి కాసేపు గందరగోళానికి గురి కాగా, ఆ తర్వాత సోఫా ఎక్కి చరణ్ పక్కన కూర్చుంది. తన మైనపు విగ్రహం పక్కన రామ్ చరణ్ కూర్చొని ఫొటో దిగగా, ఇది అందరిని ఆకట్టుకుంది. ఇక రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలించి, ఈ నెల 19 నుండి సింగపూర్‌లోని మ్యూజియంలో ప్రదర్శనకు అందుబాటులో ఉంచుతారని తెలుస్తుంది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాలను మాత్రమే మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో ఇప్పుడు రామ్ చరణ్ చేరారు.