Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు, ప్రచార కార్యక్రమాలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఎంతగా కష్టపడ్డారో తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘పెద్ది’ షూటింగ్ సమయంలో చరణ్ కంటికి, చేతికి గాయాలైన సంగతి తెలిసిందే. కంటికి చిన్న సర్జరీ చేయించుకున్నప్పటికీ, విశ్రాంతి తీసుకోకుండా వెంటనే షూటింగ్లో పాల్గొని తన అంకితభావాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా ఆయన చేతికి సపోర్ట్ బ్రేస్‌తో కనిపిస్తున్నారు. దీంతో అభిమానుల్లో ఆయన ఆరోగ్యంపై చర్చ మొదలైంది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చరణ్ తన గాయం గురించి స్పందించారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో బలంగా కింద పడటంతో చేతి మణికట్టులోని కార్టిలేజ్‌కు గాయం అయినట్లు వెల్లడించారు. సినిమా విడుదలైన తర్వాత ఆ గాయానికి సంబంధించి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు కూడా స్పందించారు. సినిమాలో క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ వంటి క్రీడా అంశాలు కీలకంగా ఉంటాయని, ముఖ్యంగా కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో చరణ్‌కు గాయం అయినట్లు వెల్లడించారు.మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా చరణ్ అంకితభావాన్ని ప్రశంసించారు. సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశారని, గాయపడినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదని చెప్పారు. ముఖ్యంగా సినిమాలోని కుస్తీ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని స్థాయిలో ఆ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలిపారు.
జాతీయ స్థాయి కుస్తీ పోటీల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.ఇక సినిమా ప్రమోషన్స్‌ను దేశవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముంబై, భోపాల్, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన చిత్రబృందం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 1న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.