Ram Charan Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం, చిత్ర యూనిట్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కీలక షెడ్యూల్‌ను నిర్వహిస్తోంది. ఈ షెడ్యూల్లో కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో చిత్రీకరణ జరగనుండటం విశేషం: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, జామా మసీద్, ఎర్రకోట వంటి చారిత్రక ప్రదేశాల్లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ షెడ్యూల్, ఇప్పుడు పక్కా భద్రత మధ్య సాగుతోంది. ఈ ఢిల్లీ షెడ్యూల్ సినిమా కథలో చాలా కీలకమైన మలుపు అని, అందుకే భారీ వ్యయంతో ఇక్కడ షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ షూటింగ్‌కి సంబంధించి తాజాగా రామ్ చరణ్ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. చేతిలో సంచి పట్టుకుని రామ్ చరణ్ ఎవరినో కలవడానికి వెళుతుండగా.. అతడిని పోలీసులు ఆపుతున్నట్లు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డులు సృష్టిస్తోంది.