Ram Charan | నేడు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో జరుపుకుంటున్నారు. బర్త్‌డే వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా చిరుకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఎమోషనల్ వీడియోను షేర్ చేశాడు. వీడియోలో చరణ్ తండ్రికి కేక్ తినిపిస్తూ, చిరు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి కూడా చరణ్‌కు కేక్ తినిపిస్తూ కుమారుడిపై తనకున్న ప్రేమని తెలియజేశారు.
అయితే రామ్ చరణ్ తన తండ్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్ట్ అందరిని టచ్ చేసింది. “ఇది కేవలం మీ పుట్టినరోజు మాత్రమే కాదు నాన్న… ఇది మీ లాంటి గొప్ప వ్యక్తికి జరుపుతున్న గొప్ప సంబరమూ! నా హీరో, నా గైడ్, నా ప్రేరణ మీరు. నా ప్రతి విజయం, నేను మోసే విలువలు అన్నీ మీ నుంచే వచ్చాయి. 70 ఏళ్ల వయసులో కూడా మీరు మా హృదయంలో యువకుడిగా ఉండి, మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా మరెన్నో సంవత్సరాలు ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు నాన్న అంటూ రామ్ చరణ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ వీడియోను పెద్దఎత్తున షేర్ చేస్తూ #HappyBirthdayChiranjeevi మరియు #Mega70 అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇక చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న మెగా 157 సినిమా టైటిల్ గ్లింప్స్ కూడా బర్త్‌డే సందర్బంగా విడుదలైంది. చిరు లుక్ ఆకట్టుకుంటూ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. 70 ఏళ్ల వయసులోనూ యంగ్ అండ్ ఎనర్జిటిక్, ఇన్స్పైరింగ్ లీడర్‌గా నిలుస్తున్న చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, దేశం అంతటా అభిమానుల సందడి కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక 70వ జన్మదిన శుభాకాంక్షలు. సినీ ప్రయాణం, ప్రజా జీవితం, సేవా కార్యక్రమాల్లో మీ విశిష్టమైన ప్రస్థానం లక్షలాది మందికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. మీ ఉదారత, అంకితభావంతో మరెన్నో జీవితాలకు వెలుగునిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఆనందం, ఆరోగ్యంతో మీరు సంతోషంగా కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.