ఎట్టకేలకు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ వీడింది. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేకర్స్ తెలిపారు. ఏప్రిల్ 30న రావాల్సిన ఈ సినిమా జూన్‌కి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే జూన్ నెలలో రిలీజ్ డేట్‌పై స్పష్టత లేకపోవడంతో అభిమానులు విడుదల ఎప్పుడోనని ఆతృతగా ఎదురుచూశారు. వారి నిరీక్షణకు తెరదించుతూ కొత్త తేదీని ప్రకటించారు.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “పెద్ది’లో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’ చిత్రాన్ని దాటి నెక్ట్స్లెవల్లో ఉంటుంది.
నన్ను ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. అందరి హృదయాలకు దగ్గరగా ఉండే చిత్రమిదని దర్శకుడు బుచ్చిబాబు సానా పేర్కొన్నారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ఇదొక ఎమోషనల్ రైడ్ అని, పాన్ ఇండియా రేంజ్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నామని నిర్మాత వెంకట సతీశ్ కిలారు అన్నారు. జాన్వీకపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ, బొమన్ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.