రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. తొలిపాట ‘చికిరి చికిరి’ సృష్టించిన సంచలనంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. తాజా సమాచారం ప్రకారం లాస్ట్ షెడ్యూల్ కోసం చిత్రబృందం ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిసింది.
ఈ షెడ్యూల్‌తో షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని అంటున్నారు. ఢిల్లీ షెడ్యూల్లో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారట. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ఆటకూలీ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.