‘ఒకే పని సెసేనాకి.. ఒకే నాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాల.. పుడతామాయేటి మళ్లీ?!’ ఈ సంభాషణతో కూడిన ‘పెద్ది’ ప్రచారచిత్రం కొన్ని రోజుల కిందట విడుదలై సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ‘పెద్ది’ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు సాన ప్రాణం పెట్టేస్తున్నాడని ప్రచార చిత్రాలే చెప్పేస్తున్నాయి.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ కథతో ఈ సినిమా రానుంది. ఈ సినిమా కోసం రామ్‌చరణ్ అభిమానులే కాదు, సగటు సినీ ప్రేమికులంతా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ‘పెద్ది’ విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రామ్‌చరణ్ 18ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు చెబుతూ ‘పెద్ది’ టీమ్ స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది.
‘మా ‘పెద్ది’ 18ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం. తెరపై ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ, బయట ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండటమే కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నాడు. మాకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలను ఇచ్చాడు. ‘పెద్ది’ నుంచి చాలా పెద్ద సర్ప్రైజ్లు మొదలుకాబోతున్నాయి.. వెయిట్ అండ్ సీ..’ అని పోస్టర్‌తోపాటు మేకర్స్ పేర్కొన్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకటసతీశ్ కిలారు, నిర్మాణం: వృద్ధి సినిమాస్.