కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో ఓ వెలుగువెలిగిందీ పంజాబీ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ముఖ్యంగా తెలుగులో అగ్ర హీరోలతో నటించి టాప్‌లీగ్‌లోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఏమైయిందో కానీ ఒక్కసారిగా రేసులో వెనకబడింది. ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసి అక్కడ కొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా సత్తా చాటే ప్రయత్నం చేసింది. అయితే నటిగా ఈ అమ్మడి పర్ఫార్మెన్స్కు పేరొచ్చింది కానీ సినిమాలు ఆశించిన విజయాలను సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఈ సొగసరి కెరీర్ ఆశాజనకంగానే ఉంది. తమిళ, హిందీ ఇండస్ట్రీలలో భారీ సినిమాల్లో నటిస్తున్నది. ఇటీవలే ఈ భామ బాలీవుడ్లో పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.
‘యారియాన్’ (2013) ఆమె తొలి హిందీ చిత్రం. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ అభిమానులకు, పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపింది. ఎన్నో అందమైన కలలతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టానని, స్వశక్తిని నమ్ముకొని ఈ స్థాయికి వచ్చానని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. భవిష్యత్తులో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, కలల వెంట పరుగు ఆపేది లేదని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసిందీ భామ. రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన తమిళ చిత్రం ‘అయలాన్’ శుక్రవారం విడుదలైంది.