మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది అగ్ర కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్. సినిమాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా సోషల్‌మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గత కొన్ని నెలలుగా తెలుగుతో పాటు హిందీ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ఈ సుందరి కాస్త విరామం తీసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ముంబయిలోని ఓ థియేటర్లో ‘బెల్‌బాటమ్’ సినిమాను వీక్షించింది. సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లో సినిమా చూడటంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నానని రకుల్‌ప్రీత్‌సింగ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. ‘థియేటర్లో అడుగుపెట్టి చాలా రోజులైంది. తెరపై టైటిల్స్ చూడగానే ఏదో తెలియని ఉద్వేగం ఆవరించింది. ఆనందానుభూతితో కన్నీళ్లొచ్చాయి. థియేటర్లో సినిమా చూడటం గొప్ప అనుభవం’ అని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలో బిజీగా ఉంది.