Rakshit Shetty | ఒక జాతీయ అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు.. రక్షిత్ శెట్టి వెండితెర ప్రయాణం వైవిధ్య భరితంగా సాగుతున్నది. ఈ కన్నడ హీరో కమనీయ ప్రేమగాథ తెలుగులో ‘సప్త సముద్రాలు దాటి..’ ప్రేక్షకాదరణ అందుకుంటున్నది. షార్ట్ ఫిల్మ్‌తో మొదలుపెట్టి పాన్ ఇండియా వైపు సాగుతున్న రక్షిత్ జీవితానుభవాలు..
సూట్‌కేస్ నిండా బట్టలు, గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో బెంగళూరులో అడుగుపెట్టే సమయానికి నా లక్ష్యం ఒక్కటే.. ఎలాగైనా సినిమాల్లో నటించడం. ఉద్యోగం ఓ సాకు మాత్రమే. ఐటీ కంపెనీలో కొలువు చేస్తూ.. సినిమాలకుసంబంధించిన పుస్తకాలు తెగ చదివేవాణ్ని. నేను ఏ ఫిల్మ్ స్కూల్లోనూ చేరలేదు. నా థాట్ ప్రాసెస్ నాదే. నామీద ఎవరి ప్రభావమూ లేదు. పడిలేస్తూ నేర్చుకున్న పాఠాలే ఎక్కువ.
గతంతో పోలిస్తే కన్నడ సినిమా చాలా మారిపోయింది. పరిధిని విస్తరించుకుంది. ప్రయోగాలను ఇష్టపడుతున్నది. వైవిధ్యాన్ని ఆదరిస్తున్నది. దీనివల్ల నటులు, దర్శకులు, రచయితల బాధ్యత పెరిగింది.
ఖాళీ దొరికితే నేను చేసేది రెండు పనులే. పుస్తకాలు చదవడం. సినిమాలు చూడటం. వెబ్‌సిరీస్ అంటే చాలా ఇష్టం. ‘అదో వ్యసనంగా మారిపోతుందిరోయ్!’ అని స్నేహితులు హెచ్చరించేవారు. అయితే కానీ, మంచి వ్యసనమేగా? అనుకునేవాణ్ని. కానీ, గంటలకొద్దీ సమయం ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతున్న సంగతి కాస్త ఆలస్యంగా గుర్తించాను. దీంతో వెబ్‌సిరీస్‌కు పరిమితి పెట్టుకున్నాను. భోజన ప్రియుడినే కానీ వంట రాదు. మ్యాగీ చేసుకోగలను. కొర్ర రొట్టెలు ఇష్టం.
ఐటీ ఉద్యోగం మహా బోరింగ్. కాకపోతే ఖాళీ దొరికేది. పర్సు నిండా డబ్బులు ఉండేవి. బెంగళూరు వీధుల్లో షికార్లు చేసే వాడిని. సముద్రతీర ప్రాంతం మాది. దీంతో సంద్రంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. నా దృష్టిలో ప్రేమ కూడా సాగరం లాంటిదే.. అపారం. ఆ అనంతాన్ని రెండున్నర గంటల్లో తెరమీద చూపించడం ఏ దర్శకుడికైనా సవాలే. అర్థమైంది.. ప్రేమ అనగానే, నా పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు కదూ! ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు.
తెల్లవారు జామునే మూడింటికి లేవడం నాకు అలవాటు. దీనివల్ల చేతిలో చాలా సమయం ఉంటుంది. అభిమాన తారల విషయానికొస్తే.. అనంత్‌నాగ్ నా అభిమాన హీరో, ఐశ్వర్యరాయ్ ఇష్టమైన హీరోయిన్. త్వరలోనే ‘సప్త సముద్రాలు దాటి’ పార్ట్-బీ కూడా ఉంటుంది. కథ విషయానికొస్తే.. తొలి భాగానికి భిన్నంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. కొత్త మలుపులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం.