‘ఇందులో నా పాత్రపేరు సితారదేవి. ఒరిస్సా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తా. పక్కింటి అమ్మాయి తరహా పాత్ర. చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది’ అని కథానాయిక మహిమా నంబియార్ అన్నారు. శ్రీవిష్ణుకు జోడీగా ఆమె నటించిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మాతలు. ఈ నెల 9న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం మహిమా నంబియార్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘శ్రీవిష్ణు స్పాంటేనిటీ ఉన్న నటుడు. ఆయనతో కలిసి నటించడం గొప్ప అనుభవం. నిజానికి ఆయనతో ‘సామజవరగమనా’లోనే చేయాల్సింది. ఆ సినిమా కోసం ఫొటో షూట్ కూడా జరిగింది.
కానీ కొన్ని కారణాలవల్ల కుదర్లేదు. ఇప్పుడు ఆయనతోనే కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది’ అని మహిమా సంతోషం వెలిబుచ్చింది. ఈ సినిమా చాలా ఫన్‌గా ఉంటుందని, 90ల నేపథ్యంలో చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని, ఆద్యంతం వినోదాన్ని పంచే ఈసినిమాలో నక్సలిజం నేపథ్యం కూడా ఉంటుందని, దాన్ని కూడా కామికల్‌గా డీల్ చేశారని మహిమా నంబియార్ తెలిపింది. తెలుగులో మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఉందని, ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నానని మహిమా చెప్పారు.