కొలొరెక్టల్ క్యాన్సర్.. ఇది చాపకింద నీరులా వ్యాపిస్తూ పెద్దపేగు, మలాశయాన్ని కమ్మేస్తున్నది. శరీరంలో నెమ్మదిగా వృద్ధి చెందే ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను తోడేస్తుంది. అయితే ఈ వ్యాధి క్యాన్సర్‌గా మారడానికి ముందు అంటే ప్రారంభ దశలో పాలిప్‌లు ఏర్పడతాయి. ఈ పాలిప్‌ల దశ నుంచి నెమ్మదిగా రూపాంతరం చెందుతూ క్యాన్సర్‌గా పరిణమిస్తుంది. దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయమే రోగి జీవిత కాలాన్ని పెంచడానికి అత్యంత కీలకమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సమయంలో స్రీనింగ్ పరీక్షల ద్వారా పాలిప్‌లను గుర్తించి తొలగించడం లేదా క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి చికిత్స అందిస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అసలు ఈ కొలొరెక్టల్ క్యాన్సర్‌ను ఎప్పుడు గుర్తించాలి, ఎలా గుర్తించాలి, ముందస్తు స్క్రీనింగ్ వల్ల రోగికి కలిగే ప్రయోజనాలు ఏంటి తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
1. క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న పాలిప్‌లను ముందుగానే గుర్తించి తొలగించవచ్చు.
2. ఇప్పటికే క్యాన్సర్ ఏర్పడితే తొలిదశలో గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గించడంతో పాటు, క్యాన్సర్ వచ్చిన వారిలో మరణాల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు.
కొలొనోసోపీ కొలొరెక్టల్ క్యాన్సర్ స్రీనింగ్‌లో విస్తృతంగా ఉపయోగించే పరీక్ష. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ నిర్వహించే ఈ ప్రక్రియలో ప్రత్యేక కెమెరా సహాయంతో పెద్దపేగు, మలాశయం మొత్తం భాగాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఇతర స్రీనింగ్ పరీక్షల్లో అసాధారణ ఫలితాలు వచ్చినప్పుడు కూడా కొలొనోసోపీ అవసరం పడవచ్చు. పాలిప్‌లు కనిపిస్తే పరీక్ష సమయంలోనే వాటిని తొలగించే అవకాశం ఉండటం దీని ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. సాధారణ రిస్ ఉన్న వ్యక్తుల్లో కొలొనోసోపీ ఫలితాలు సాధారణంగా ఉంటే, తదుపరి పరీక్షకు 10 సంవత్సరాల విరామం ఉండవచ్చు. అయితే ఇతర స్రీనింగ్ పరీక్షలతో పోలిస్తే కొలొనోసోపీ పరీక్షలో పాలిప్ తొలగించినప్పుడు రక్తస్రావం లేదా పేగు గోడకు గాయం లాంటి సమస్యలు అరుదుగా సంభవించే అవకాశాలు ఉంటాయి.
ఈ పరీక్ష కొలొనోసోపీకి దగ్గరగా ఉన్నప్పటికీ మొత్తం పెద్దపేగును పరిశీలించదు. ప్రధానంగా మలాశయం, పెద్దపేగు దిగువ భాగాన్ని స్కాన్ చేస్తుంది. గతంలో ఇది సాధారణ స్రీనింగ్ పద్ధతిగా ఉండేది. అయితే ప్రస్తుతం కొలొనోసోపీ అందుబాటులోకి రావడంతో దీని వినియోగం గణనీయంగా తగ్గింది.
కంప్యూటెడ్ టోమోగ్రాఫిక్ కొలొనోగ్రఫీ (సీటీసీ)ని వర్చువల్ కొలొనోసోపీ అని కూడా అంటారు. ప్రత్యేక ఎక్స్ రే, కంప్యూటర్ సాంకేతికతతో పెద్దపేగు, మలాశయానికి రెండు లేదా మూడు పరిమాణాల్లో చిత్రాలను రూపొందిస్తారు. కొలొనోసోపీ కంటే ఇది తకువ ఇన్వేసివ్ పరీక్ష. సాధారణంగా తకువ సమయంలో పూర్తవుతుంది. కోలుకోవడానికి ప్రత్యేక సమయం అవసరం ఉండదు. అయితే చిన్న పాలిప్‌లను గుర్తించడంలో కొలొనోసోపీతో పోలిస్తే దీని సామర్థ్యం తకువగా ఉండవచ్చు. అలాగే ఇతర అవయవాల్లో అనుకోకుండా కనిపించే మార్పుల కారణంగా అవసరం లేని అదనపు పరీక్షలు చేయించుకోవాల్సి రావచ్చు.
కొలొరెక్టల్ క్యాన్సర్, పెద్ద పాలిప్‌లు కొన్ని సందర్భాల్లో పేగులోకి స్వల్పంగా రక్తస్రావం కలిగిస్తాయి. ఈ రక్తం కంటికి కనిపించకపోయినా ప్రత్యేక స్టూల్ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. స్టూల్ టెస్ట్‌లో ఫలితం పాజిటివ్‌గా వస్తే తదుపరి నిర్ధారణ కోసం సాధారణంగా కొలొనోసోపీ చేయాల్సి ఉంటుంది.
గ్వాయక్ ఆధారిత ఎఫ్ఓబీటీ: గ్వాయక్ ఆధారిత ఫీకల్ ఆకల్ట్ బ్లడ్ టెస్ట్ (gFOBT) రసాయన చర్య ద్వారా మలంలో దాగి ఉన్న రక్తాన్ని గుర్తిస్తుంది. క్యాన్సర్ కారణంగా రక్తస్రావం ప్రతిసారీ కనిపించకపోవచ్చు. అందుకని కచ్చితత్వం కోసం నిర్ణీత వ్యవధుల్లో పునరావృత పరీక్షలు అవసరం కావచ్చు. ఈ పరీక్షకు ముందు కొన్ని ఆహారాలు, మందులకు సంబంధించిన పరిమితులు పాటించాల్సి రావచ్చు. అందువల్ల పరీక్షకు ముందు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
ఎఫ్ఐటీ.. సులభమైన స్టూల్ పరీక్ష: ఫీకల్ ఇమ్యూనో కెమికల్ టెస్ట్ (ఎఫ్ఐటీ) మలంలో దాగి ఉన్న మానవ రక్తంలోని హిమోగ్లోబిన్‌ను యాంటీబాడీల ద్వారా గుర్తిస్తుంది. gFOBTతో పోలిస్తే ఎఫ్ఐటీకి సాధారణంగా ఆహారపరమైన ప్రత్యేక పరిమితులు అవసరం ఉండవు. అలాగే తకువ నమూనాలతో పరీక్ష నిర్వహించే అవకాశం ఉండటం వల్ల రోగులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అయితే FIT (ఫిట్) పాజిటివ్‌గా వస్తే దానిని తుది నిర్ధారణగా భావించకూడదు. తదుపరి వైద్య మూల్యాంకనం, అవసరమైతే కొలొనోసోపీ చేయించుకోవాలి.
ఫిట్- డీఎన్ఏ పరీక్ష: ఫిట్-డీఎన్ఏ పరీక్ష మలంలో రక్తాన్ని గుర్తించడంతో పాటు, పేగు నుంచి విడిపోయే కణాల్లో ఉండే కొన్ని జన్యు మార్పులను కూడా గుర్తిస్తుంది. పెద్ద పాలిప్‌లు, కొలొరెక్టల్ క్యాన్సర్‌ను గుర్తించడంలో ఇది ఫిట్ కంటే మెరుగైన ఫలితాలు ఇస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే తప్పుడు పాజిటివ్ ఫలితాలు ఎకువగా రావచ్చని గుర్తుంచుకోవాలి. అలాంటి సందర్భాల్లో అదనంగా మరోసారి కొలొనోసోపీ అవసరం కావచ్చు.
సాధారణ రిస్ ఉన్నవారిలో కొలొరెక్టల్ క్యాన్సర్ స్రీనింగ్ను సాధారణంగా మధ్య వయసు నుంచి ప్రారంభించాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అయితే కుటుంబంలో కొలొరెక్టల్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, కొన్ని జన్యుపరమైన పరిస్థితులు లేదా ఇతర వైద్యపరమైన రిస్ కారకాలు ఉన్నవారికి స్రీనింగ్ను మరింత ముందుగానే ప్రారంభించాల్సి రావచ్చు. స్రీనింగ్ ప్రారంభించే వయసు, ఏ పరీక్ష చేయాలి, ఎంత వ్యవధికి ఒకసారి చేయాలి అనే అంశాలు రోగి వ్యక్తిగత రిస్పై ఆధారపడి ఉంటాయి. అందువల్ల కుటుంబ చరిత్ర లేదా ఇతర రిస్ కారకాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి వ్యక్తిగత స్రీనింగ్ ప్రణాళిక రూపొందించుకోవడం ఉత్తమం.
కొలొరెక్టల్ క్యాన్సర్‌ను పూర్తిగా నిరోధించలేకపోయినా, ముందస్తు స్రీనింగ్తో దాని ముప్పును గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్యాన్సర్‌గా మారకముందే పాలిప్‌లను గుర్తించి తొలగించడం, క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుంది. వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్యుల సలహాతో సరైన స్రీనింగ్ పరీక్షను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం.